PAN Card Loan Fraud: మీ పాన్ కార్డు తో ఎవరో లోన్ తీసుకున్నారా? ఇలా చెక్ చేయండి!
PAN Card Loan Fraud: మీ పాన్ కార్డు భద్రంగా ఉందా? నేటి రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర పాన్ కార్డు ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లకు లింక్ చేయడం తప్పనిసరి కావడంతో అందరూ తీసుకుంటున్నారు. కానీ చాలామంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోకుండా తమ పాన్ వివరాలను ఇష్టారీతిన షేర్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని మోసగాళ్లు వాడేసుకుని ఆ డేటాను అక్రమ రుణాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది గిరిజనుల పేర్లపై కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి మోసాల నుండి తప్పించుకోవాలంటే మీ పాన్ తో ఎవరో రుణం తీసుకున్నారా లేదా అన్నది చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.
మీ పాన్ ఆధారంగా ఎవరైనా ఫేక్ లోన్ తీసుకున్నారో తెలుసుకోవాలంటే సిబిల్ (CIBIL), ఎక్విఫాక్స్ (Equifax), ఎక్స్‌పీరియన్ (Experian) వంటి క్రెడిట్ బ్యూరోల దగ్గర నుంచి క్రెడిట్ రిపోర్ట్ తీసుకోవాలి. ఆ రిపోర్టులో మీ పేరుతో ఉన్న అన్ని రుణాల వివరాలు, క్రెడిట్ కార్డ్ లావాదేవీలు, బాకీలు, ఎంక్వైరీల రికార్డులు ఉంటాయి. మీరు ఎప్పుడూ అప్లై చేయని రుణాలకు సంబంధించిన హార్డ్ ఎంక్వైరీలు కనిపిస్తే అవి అనుమానాస్పదమైనవే. అప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాలి.
మీరు తీసుకోని రుణాలు రిపోర్టులో ఉంటే సంబంధిత బ్యాంక్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. acknowledgment లేఖ తీసుకోవాలి. దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేయాలి. అవసరమైతే RBI Ombudsmanకు ఫిర్యాదు చేయడం మంచిది. ఇలా చేస్తే భవిష్యత్తులో మీకు సమస్యలు తలెత్తకుండా ఉంటుంది.
ఇలాంటి మోసాలను ముందుగానే నివారించాలంటే పాన్ లేదా ఆధార్ నంబర్ ఎవరితోనూ WhatsApp ద్వారా లేదా unknown వెబ్‌సైట్లలో షేర్ చేయరాదు. రిటైల్ స్టోర్లలో పాన్ వివరాలు ఇవ్వడానికి ముందు ఆ సంస్థ నిజమైనదేనా అని చెక్ చేయాలి. PAN పోయిన వెంటనే డూప్లికేట్ కోసం అప్లై చేయాలి. ప్రతి కొన్ని నెలలకు ఒకసారి క్రెడిట్ రిపోర్ట్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఫైనాన్షియల్ యాప్‌లలో 2-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ వాడాలి. SMS, Email నోటిఫికేషన్లు ఎప్పుడూ ఆన్‌లో ఉంచాలి.
ఇలా జాగ్రత్తలు పాటిస్తే మీ PAN Card Loan Fraud మోసాల నుండి రక్షణ పొందవచ్చు.