ఏపీ ప్రజలకు దసరా గుడ్ న్యూస్ 2025 – పేదలకు గృహ ప్రవేశాలు | AP Housing Scheme
ఏపీ ప్రజలకు మరోసారి దసరా పండగ సందర్భంగా శుభవార్త అందనుంది. పేద కుటుంబాల కోసం చేపట్టిన గృహ నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేస్తూ, విజయదశమి నాటికి గృహ ప్రవేశాలు జరగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి పనులను త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
లబ్ధిదారులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తూ గృహాల నిర్మాణాలను ప్రోత్సహిస్తోంది. ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వారికి రూ.50 వేలు, ఎస్టీ వర్గానికి చెందిన వారికి రూ.75 వేలు చొప్పున ఆర్థిక సాయం ఇచ్చింది. ఈ సాయంతో అనేక మంది లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను ముందుకు తీసుకెళ్లారు. రూఫ్ కాస్ట్, లెంటల్ లెవల్, రూఫ్ లెవల్ దశల్లో ఉన్న ఇళ్లు త్వరగా పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా కొత్త లబ్ధిదారులకు రూ.4 లక్షల ఆర్థిక సాయం అందే అవకాశం ఉంటుంది. ఇందులో కేంద్రం 60% వాటా కలిగిస్తే, రాష్ట్ర ప్రభుత్వం 40% భారం మోస్తుంది. ఇక ఇళ్ల స్థలం లేని వారికి పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు భూమిని కేటాయించాలన్న నిర్ణయం కూడా తీసుకుంది.
దీంతో, దసరా పండగ నాటికి పేద ప్రజలు తమ కొత్త ఇళ్లలోకి ప్రవేశించే అవకాశం లభించనుంది. ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల దిశగా ఇంటి స్థలాల పంపిణీ, గృహాల నిర్మాణం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించడం పేద కుటుంబాలకు పెద్ద ఊరటగా మారనుంది.